బిడ్డను పెంచడానికి రూ.6.5 కోట్లా? ఓ ఆర్థిక సలహాదారు వైరల్ వ్యాఖ్యలు
- చిన్నారి పుట్టినప్పటి నుంచి 21 ఏళ్ల వరకు పెంచేందుకు అయ్యే ఖర్చులను లెక్కవేసిన ఉదయన్
- ప్రతి 6 ఏళ్లకు చదువు ఖర్చులు రెట్టింపు అవుతున్నాయని వెల్లడి
- పిల్లల బదులు కుక్కనో, పిల్లినో పెంచుకోవడం బెటర్ అంటున్న నెటిజన్లు
భారతదేశంలోని మెట్రో నగరాల్లో పిల్లలను పెంచడమనేది ఇప్పుడు ఒక భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయింది. ఫైనాన్షియల్ అడ్వైజర్, కంటెంట్ క్రియేటర్ ఉదయన్ అధ్వే దీనిపై చేసిన విశ్లేషణ ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఉదయన్ అధ్వే తన ఇన్స్టాగ్రామ్ వీడియోలో... ఒక చిన్నారిని పుట్టినప్పటి నుంచి 21 ఏళ్ల వరకు పెంచడానికి అయ్యే ఖర్చులను వివరంగా లెక్కవేశారు. ఆయన విశ్లేషణ ప్రకారం, విద్యారంగంలో ద్రవ్యోల్బణం ఏడాదికి 10-12 శాతం వరకు పెరుగుతోంది. అంటే ప్రతి 6 ఏళ్లకూ చదువు ఖర్చులు రెట్టింపు అవుతున్నాయి. ఉదాహరణకు, నేడు ఒక కాలేజీ కోర్సు రూ. 20 లక్షలు ఉంటే, ఆ చిన్నారికి 18 ఏళ్లు వచ్చేసరికి అది రూ. 1.6 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు చేరుకుంటుందని ఆయన హెచ్చరించారు.
కేవలం స్కూల్, కాలేజీ ఫీజులే కాకుండా.. స్పోర్ట్స్, మ్యూజిక్ క్లాసులు, కోచింగ్ సెంటర్లు, గ్యాడ్జెట్స్ (ల్యాప్‌టాప్, ఫోన్), వెకేషన్లు, ఆరోగ్య ఖర్చులు, లైఫ్ స్టైల్ ఖర్చులన్నీ కలిపితే ఈ మొత్తం రూ. 6.75 కోట్లకు చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. సాధారణ 'చైల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు' ఇచ్చే 5-6 శాతం రాబడి ఈ ఖర్చులను తట్టుకోవడానికి సరిపోదని, తల్లిదండ్రులు మరింత లోతుగా ఆలోచించి పెట్టుబడులు పెట్టాలని సూచించారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు నెటిజన్లు "ఇలాంటి వీడియోలు భయాన్ని, ఆందోళనను పెంచుతున్నాయి" అని అభిప్రాయపడగా, మరికొందరు జోక్ చేస్తూ "అంత డబ్బుతో ఒక లంబోర్ఘిని కారు కొనుక్కోవచ్చు" లేదా "పిల్లలకు బదులు కుక్కనో, పిల్లిని పెంచుకోవడం బెటర్" అని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా, మారుతున్న కాలంలో పిల్లల పెంపకం అనేది ఒక ఖరీదైన వ్యవహారంగా మారిందన్నది కాదనలేని వాస్తవం.